కథ ,కథానిక ,చిట్టికథ ,పొట్టి కథ వగైరాలకు నిర్వచనాలు కోసం అనవసరంగా బుర్ర బద్దలు చేసుకోకుండా,కథను రెండు విభాగాలుగా
విభజించుకుని ,పెద్ద కథ -చిన్న కథ అనుకుంటే ,ఈ రెంటిలోనూ చిన్న
కథ రాయడం కొంచెం కష్టం అనుకుంటాను. ఎంతటి పెద్ద వస్తువునైనా
చిన్న కథగా మలచి మొత్తమ్ సారాంశం ఆ కథలో వచ్చేట్టు రాయగలగ-
డం రచయిత ప్రతిభకు తార్కాణం. చిన్న కథలో రచయిత ప్రతిభను యిట్టె
గమనించగలం. కథను సూక్ష్మంలో అర్ధవంతంగా చెప్పగలగడమే ఆ ప్రతిభకు ఆయువు పట్టు. అలాంటి మంచి ప్రతిభావంతులైన పాతతరం
కథా రచయితల్లో శ్రీ కె . కె . మీనన్ (కానేటి కృష్ణ మీనన్ )గారు ఒకరు.
ఆయన ఎలాంటి కథ రాసినా రెండు మూడు పేజీలకు మించి ఉండదు గాని ,మూడొందల పేజీల నవలకు సరిపడ కథా సారాంశం అందులో
ఇమిడి ఉంటుంది. అది కథను రాయడంలోని ప్రత్యేకత !
ఆయన ఏకధాటిగా ముప్పై సంవత్సరాలపాటు కథలు రాసినా ,పెద్దల-
పాఠకాదరణ పొందినా ,మీనన్ గారు కేవలం రెండు కథ సంపుటాలను మాత్రమే స్వయంగా పుస్తక రూపంలోకి తేగలిగారు. అందులో మొదటిది
ఇది స్త్రీకింగ్ కాదు ,రెండోది పులికూడు . ఇప్పుడు నేను నాకు నచ్చిన కథగా మీ ముందు ఉంచుతున్నది ‘ ఖానూన్ ‘ అనే కథ. ఖానూన్
అంటే ,శాసనం అని అర్ధం. ఇది ఉర్ధూ పదమైనప్పటికీ ,తెలంగాణా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ముఖ్యంగా హైదెరాబాద్ లో దీనిని తెలుగు పదం అన్నంత తేలిగ్గా వా డేస్తారు ,ముఖ్యంగా నాటి పాతతరం ప్రజానీకం!
కోస్తా జిల్లాలో పుట్టి పెరిగిన మీనన్ గారు ఉద్యోగ రీత్యాహైదరాబాద్ లో
స్థిరపడినప్పుడు ,అక్కడి జన జీవనంలో కలిసి బ్రతుకుతున్న సందర్భం
లో ,అక్కడి వివిధ వర్గాల భాష ,యాస ,అక్కడి మాండలిక పదాలు ఆయన త్వరలోనే వంటబట్టించుకున్న వైనం ఈ కథ చదివితే అర్ధం అవుతుంది. కాలుతున్న కడుపును చేతపట్టుకుని ,హైదరాబాద్ లాంటి
నగరంలో ఏదో కూలి - నాలి చేసుకుని జీవనం చేయొచ్చన్న అమాయక-
పు ,వలస కూలీలు నల్లగొండ ,మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి
హైదరాబాద్ కు వచ్చి ఎన్ని ఇబ్బందులకు గురి అవుతారో మీనన్ గారు
ఖానూన్ కథలో హృద్యమంగా చర్చించారు. ఒక నియమం,ఒకనిబంధన
లేదా ఒక శాసనం ,పెద్దవాళ్లకు ఎంత సహాయ కారిగా ఉంటుంది,అదే --
సామాన్యుడి విషయం వచ్చేసరికి అదే శాసనం ఎలా రూపాంతరం చెంది
ఇబందులకు గురిచేస్తుందో కళ్ళకు కట్టినట్టు కథలో చెప్పారు. అమాయక-
వలస కూలీ ప్రతి స్థాయిలోను ఎలా దోపిడీకి గురి అవుతాడో ,మీనన్ గారు
స్వయంగా అనుభవించినంత సహజంగా కథను చిత్రించారు. హైదరాబాద్
గురించి ఏమాత్రం అవగాహన లేని అమాయకపు కూలీలు వాళ్ళ వూళ్ళో
బస్సు ఎక్కి ,హైదరాబాద్ లో బస్సు దిగినప్పటినుండి ,ప్రతిస్థాయిలోనూ
చివరికి సహాయం చేయవలసిన పోలీసు వ్యవస్థకూడా శాసనాన్ని అడ్డం
పెట్టుకుని పేదవాడిని ఎలా నిలువు దోపిడీ చేస్తారో మీనన్ గారు ఈ కథలో
చెప్పారు. ఆయా వ్యక్తుల సంభాషణలు చదూతున్నప్పుడు ,మీనన్ గారు
భాగ్యనగరం లోనే పుట్టి పెరిగారా ?అన్న అనుమానం పాఠకుడికి రాక తప్పదు . వెనుకబడిన జిల్లాలలోని పేద ప్రజలు గ్రామాల్లో ,జమిందారీ
వ్యవస్థను తట్టుకోలేక ,నగరాలకు వచ్చినా ,ఖానూన్ వాళ్లకి ఏ రకంగానూ
ఉపయోగపడక ,అష్టకష్టాలు గురికావడం వంటి సన్నివేశాలు ఈ కథలో
చదువుతుంటే గుండెను పిండేసినంత పని అవుతుంది. కథలో ఎక్కడా కృత్రిమత్వం కనపడదు . తనదికాని భాష యాస ,లోకి రచయిత ప్రవేశిం
చి సహజత్వాన్ని పండించడం మామూలు విషయం కాదు.
ఇంతకు మించి కథకు దోహదం చేసిన అంశం ఏమిటంటే ,హైదరాబాద్ లో
మీనన్ గారు కొంతకాలం మాసాబ్ ట్యాంక్ దగ్గర పాలిటెక్నీక్ హాస్టల్ లైన్ లో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటికి ఎదురుగా గట్టు ఖాళీ స్థలంలో అనేక గుడిసెలు ఉండేవి . వలస కార్మికులకు అద్దెకు ఇచ్చేవారు. ఒక పెద్ద వ్యక్తి
ఆధీనంలో ఆ గుడిసెలు ఉండేవి . వాళ్ళ జీవన విధానం క్షుణ్ణంగా పరిశీలించారు మీనన్ గారు. తత్ఫలితంగా ‘ ఖానూన్ ‘ వంటి కథలు వారి
కాలంనుండి జాలువారాయి. హైదరాబాడ్ లో వలస కార్మికుల సాధకబాధ
కాలు ఎలావుండేవో తెలియాలంటే మీనన్ గారి కథ ‘ఖానూన్ ‘కథ చదవా
లిసిందే. ఎన్ని సార్లు చదివినా .. మళ్ళీ .. మళ్ళీ .. చదవాలనిపించే మీనన్ గారి ‘ఖానూన్ ‘ కథ నాకు ఎంతగానో నచ్చిన కథ. ఈ కథ
మీనన్ గారు 1977 లో రాశారు.
***
--------------డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ .
**ఈ కథ మీనన్ గారి కథల సంపుటి ‘ఇది స్త్రీకింగ్ కాదు ‘ నుండి స్వీకృతం .
Comments