కథలు వినడానికి,చెప్పడానికీ కూడా బాగుంటాయి . వినేవాడి పరిస్థితి చెప్పేవాడి సామర్ధ్యం పైన ఆధార పడి ఉంటుంది. కథ చెప్పేవాడి ఉత్సాహం,వినేవాడి ఆత్రుతపైనా,ఆరాటం పైనా ఆధారపడి ఉంటుంది. అంటే కథ రాసేవాడి ప్రతిభమీద పాఠకుడి కథ చదివే గుణం ఆధారపడి ఉంటుందన్నమాట!సరే,కథ బావుందా లేదా అన్నది వారి వారి అభిరుచిమీద ఆధారపడి ఉంటుంది ,అది వేరే విషయం
కథలన్నీ కట్టు కథలు కావు,అలాగే కథా రచయితలు రాసే కథలన్నీ నిజ సంఘటనలు కాకపోవచ్చు!మరి కొన్ని కథల్లో కొంత నిజం ,కొంత కల్పితం వుండి ,పాఠకుడిని అమితంగా ఆకట్టుకునే విధంగా రచయిత
తన నైపుణ్యాన్ని నిరూపించుకోవచ్చు. కథా రచయిత ,తాను కథను ఎంత కొత్తగా చెప్పాలన్నా,నడుస్తున్న
మూసలోనే చెప్పాలన్నా ,రచయిత రాసే ప్రతి కథ వెనుక ఒక కథ తప్పకవుంటుంది. ఐతే ఆ కథ మాత్రం
రచయిత మనసులోనే ఉంటుంది ,దాని ఆధారంగా రాసిన కథ మాత్రం రచయిత ద్వారా పాఠకుడికి చేరు -
తుంది !కథ వెనుక కథ తెలియాలంటే ,మళ్ళీ కథా రచయిత మాత్రమే పాఠకుడికి చెప్పగలడు. ఈ రెంటిని
సమన్వయము చేసుకుని ,ఆలోచించే పాఠకుడికి కొన్ని గమ్మత్తయిన విషయాలు బయటికి వచ్చి కొంత
ఆశ్చర్యాన్ని కూడా కలుగజేయ వచ్చు. అలాంటి ఒక అనుభవాన్ని పాఠకుల ముందుకు తీసుకురావడమే ఈ
వ్యాసం ముఖ్యోద్దేశం !
సుమారు పది సంవత్సరాలనాటి మాట. నేను కథలు మహా జోరుగా రాస్తున్న రోజులు అవి. ఆసుపత్రి వాతావరణం నేపధ్యంగా కథలు రాసిన కాలం అది. అప్పుడు వరంగల్ (పాత )జిల్లాలో ,ఒక తాలూకా ఆసుపత్రిలో దంతవైద్యుడిగా పని చేస్తున్న రోజులు. అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ,కథ
రాసాను. కథ పేరు -”తిరగబడ్డ త్రికోణం “( ఈ కథ నా మొదటి కథల సంపుటి ‘కె. ఎల్వీ. కథలు ‘సంపుటి లో వుంది. )కథ పేరు చదవగానే , పాఠకుడికైనా అర్ధమైపోతుంది ,ఇదేదో కుటుంభ సంక్షేమం కు సంభందించిన కథ అని. నిజమే,పేరులోనే వుంది ఈ కథకు నేపధ్యం కుటుంభ సంక్షేమ అంశం అని. ఎందుకంటె ఎర్ర త్రికోణం దానికి ప్రభుత్వం రూపొందించిన చిహ్నం కాబట్టి. !
కథ టైటిల్ ను బట్టి,త్రికోణం తిరగ బడ్డది కాబట్టి,,ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయిందనే అర్ధం చెప్పకనే చెబుతున్నది. అసలు ఏమి జరిగిందంటే -అప్పటి జిల్లా కలెక్టరు గారు ,జిల్లా ప్రజలనుద్దేశించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బాంకుల్లో వ్యవసాయ రుణాలు ,ఇతర రుణాలు పొందగోరేవారు ,కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకుని వున్నట్లైతే ,ప్రాధాన్యత ఉంటుందన్నది ఆ .. ప్రకటన సారాంశం. ఇక జనం ప్రభుత్వ ఆసుపత్రులమీదికి ఎగబడ్డారు !
ఆపరేషన్ చేయించుకున్నవాళ్లు,చేయించుకోనివాళ్లుకూడా ,ఆసుపత్రులదగ్గర క్యూ కట్టారు. ఎవరి స్థాయిలో
వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకోడానికి ,చోటా -మోటా నాయకలిని వెంటబెట్టుకుని వచ్చారు.
ఒక నెల రోజులపాటు వేళ్లతోనే ఆసుపత్రి కళకళ లాడింది. వైద్య మహాశయుల జేబులు కూడా బాగానే నిండి -
నట్టు నాటి సమాచారం. ఈ నేపథ్యంలో నా దృష్టికి ఒక వ్యక్తి వ్యవహారం కథ రాయడానికి పురిగొల్పింది. ఆ వ్యక్తి అవసరం ,వైద్యుడి దురాశకు పురిగొల్పి ,ప్రతిష్టాత్మకమైన కుటుంబ సంక్షేమ కార్యక్రమానికి చిల్లులు పొడిచి నట్టు అయింది. నిజానికి ,ఆ ఆగంతకుడికి ,వేసెక్టమీ ఆపరేషన్ కాలేదు. కానీ,బ్యాంక్లో ఋణం పొందాలంటే ఆపరేషన్ చేయించుకున్న సర్టీఫికేట్ కావాలి. అందుకే ,డాక్టరుకు పరిచయం ఉన్న ఒక రాజకీయ నాయకుడిని తన ఊరినుండి తెచ్చుకున్నాడు. మరి ,డాక్టరుకు డబ్బు కావాలి,సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆధారమూ కావాలి. అందుకని ,ఆ వ్యక్తిని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి ,”స్క్రోటమ్ “దగ్గర ఆపరేషన్ చేసినట్టు చిన్న గాటు పెట్టి కుట్లు వేశాడు. ఐతే ,ఆ వ్యక్తి పెద్దగా అరుచుకుంటూ ,అటు వైద్యుడిని ,ఇటు రాజకీయ నాయకుడిని,తిట్టిన తిట్టు తిట్టకుండా ,తిట్టడం మొదలు పెట్టాడు. విషయం తెలియక అటు డాక్టరు,ఇటు రాజకీయనాయకుడు,,అతని ప్రవర్తనకు ,ఖిన్నులై చూడడం మొదలు పెట్టారు.
అసలు విషయం ఏమిటంటే ,ఆ.. సర్టీఫికేట్ కోసం వచ్చిన వ్యక్తి ,పెళ్లి చేసుకుని చాలా కాలమైంది గానీ,సంతాన ప్రాప్తి కలగలేదు !అందుకని కొంతకాలం వేచి చూసి,వైద్యులచేత అవసరమైన పరీక్షలు అన్నీ చేయించి ,ఇక తనకు పిల్లలు పుట్ట రని రూడీ అయినతరువాత ,భార్య చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడట !పెళ్లి చేసుకుని పది రోజులు కూడా కాలేదు. ఇప్పుడు డాక్టరు ఆపరేషన్ (వేసెక్టమీ) చేసేశాడని అతని ఆందోళన. జరిగిన విషయం చెప్పి అతనిని శాంతిప చేయడానికి ,వాళ్ళిద్దరికీ తల ప్రాణం తోకకు వచ్చినంత పని ఐంది. అది డూప్లికేట్ ఆపరేషన్ అని చెప్పాక గాని అతగాడు శాంతించలేదు. డాక్టరు కు ఫీజు చెల్లించి సర్టీఫికేట్ తీసుకుని సంతోషంగా వెళ్లిపోయాడతను. ఇది నాకు కొంచెం బాధ కలిగించిన మాట వాస్తవం. ప్రభుత్వాన్ని ,ప్రభుత్వం చేపట్టే పథకాలను నిర్వీర్యం చేయడమే కాక,తప్పుడు లెక్కలతో ,ఆర్ధికంగా దగా చేయడం క్షమించరాని నేరం. అందుకే ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథ రాసి చల్లబడ్డాను. చాలామంది పాఠకుల ప్రశంశలను అందుకుంది ఈ కథ. ఈ కథ చదివిన వారికి ,ప్రసిద్ధ కథా రచయిత కీ. శే. కె. కె. మీనన్ గారు రచించిన ‘ఎర్ర త్రికోణం ‘కథ గుర్తుకు రాక మానదు ,లేదంటే ఆ కథకు నేపధ్యం వేరు అంతే !
ఇలా ,ప్రతి రచయిత కలం నుండి వెలువడే ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. కథ పుష్టిధనం కోసం కొన్ని
హంగులు , ఆర్భాటాలు ,రచయిత సృష్టించక తప్పదు.
* * *
డా. కె. ఎల్. వి. ప్రసాద్ ,
హనంకొండ -
Comments