జనవరి నెల ,
ఒకటో తారీకు. కొత్తసంవత్సరం సంబరం ఎలా వున్నా ఏనెల అన్నదానితో సంబంధం లేకుండా ఒకటో తారీకు అతనికి చాలా ఇష్టమైనది,అవసరమైనదీనూ !ప్రతి నెల ఫస్ట్ తారీకు వచ్చిందంటే ,తెల్లవార క ముందే నిద్ర లేస్తాడు రాఘవయ్య. రోజూ కంటే ఒక అరగంట ముందే
నిద్ర లేవడం ఆయన జీవన శైలిలో ముఖ్య అంశం. ఆయనకు అలా అలవాటు అయిపోయింది
అంతే !నిద్రలేవడం ,కాలకృత్యాలు తీర్చుకోవడం,ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ-
పిండుకొని ,అది తాగిన తర్వాతే ,వాకింగ్ కోసం తన ఇంటికి దగ్గరలోనే వున్న కాలేజీ గ్రౌండ్ కి
వెళ్తాడు. గ్రౌండ్ చుట్టూ మిత్రులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ,కనీసం మూడు రౌండ్స్ అయినా తిరుగుతాడు. పెద్ద అలసిపోయినట్టు కనిపించదు గాని,వళ్లంతా తడిచిన చెమటతో
మెల్లగా నడుచుకుంటూ ,ఇంటికి చేరుకుంటాడు రాఘవయ్య.
రాఘవయ్య ఇల్లు చేరుకునేసరికి,ఆయన ధర్మపత్ని విశాలమ్మ ,నీళ్లు కాగబెట్టి ,స్నానానికి,
వేడి నీళ్లు సిద్ధం చేసి ఉంచుతుంది. వంటిమీద తడిసిన బట్టలు తీసి ‘రెస్ట్ రూమ్ ‘(బాత్ రూమ్)
లోనికి ప్రవేశించి,హాయిగా స్నానం చేస్తాడు. ఉతికిన పొడి బట్టలు కట్టుకుని,వరండాలో సిద్ధంగా
వున్న వాలు కుర్చీలో,కూర్చుని తెలుగు దిన పత్రిక చదవడానికి ఉద్యుక్తుడౌతాడు. ఈలోగా,
భార్యామణి విశాలమ్మ పోగలుకక్కుతున్న కప్పుడు కాఫీ తెచ్చి టీ -పాయ్ మీద పెట్టి తాగ -
మన్నట్టు సైగ చేసి వంటగదిలోకి పోయి తన తదుపరి వంట కార్యక్రమాల్లో నిమగ్నమైపోతుంది
రాఘవయ్య,దిన పత్రిక చదువుతూనే,కొంచెం .. కొంచెం,కాఫీ సిప్ చేస్తూ,బయట తగిలించిన గోడ గడియారం వంక ,అప్పుడప్పుడు దృష్టిపెడుతూ,దినపత్రిక చదవడం పూర్తి-
చేస్తాడు. సమయం అనుకూలిస్తే,అప్పుడప్పుడు విశాలమ్మ వచ్చి , భర్త పక్కన చతికిలబడి,
కాస్సేపు ముచ్చట్లు పెడుతుంది. విశాలమ్మ చెప్పే ప్రతి విషయము చాలా శ్రద్దగా వింటాడు
రాఘవయ్య. తదుపరి ,భర్తను లోపలి తీసుకు వెళ్లి ప్రేమగా టిఫిన్ వడ్డిస్తుంది విశాలమ్మ.
ప్రతి నెల మొదటి తేదీ ,ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం రెండు గంటల సమయం
వరకు రాఘవయ్యకు చాలా ముఖ్యమైన సమయం. రాఘవయ్యకే కాదు,ఆయన మాదిరిగా
ఉద్యోగ విరమణ చేసిన చాలామంది పెన్షనర్లకు ,అది చాలా అవసరమైన సమయం.ఎందు చేత
నంటే,సాధారణంగా ఆసమయంలోనే ,తమ తమ బాంక్ అకౌంట్లలో,పెన్షను నమోదు అవుతుంటుంది. పెన్షన్ వచ్చినట్టు మొబైల్ లో చూసుకోగానే,నెలవారీ ఖర్చుల గణన మొదల
వుతుంది. ఎప్పుడు ఏమి తెచ్చుకోవాలో,ఎవరికి యెంత ఇవ్వాలో,ఆ నెల ఎలాంటి ప్రత్యేకమైన
ఖర్చులు ఉన్నాయో,మిగులు బడ్జెట్టా?లోటు బడ్జెట్టా ?తదితర అంశాలకు చెందిన మొత్తం చిట్టా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది.
ఇంటి అద్దె కట్టడం తో మొదలై ,వచ్చిన మొత్తం పెన్షన్ కొవ్వొత్తిలా కరిగిపోతుంది. మళ్ళీఫస్ట్ తేదీ కోసం ఎదురు చూడాల్సిందే !ఎప్పటి మాదిరిగానే ,జనవరి ఫస్టుకి కూడా,తన కార్యక్రమా--
న్నీ,తు. చ ,తప్పకుండా పాటించాడు. భార్య విశాలమ్మ తెచ్చి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ,దిన
పత్రిక చదవడం మొదలు పెట్టాడు. కాసేపటికి ఆపని పూర్తయి పోయింది. భార్య పిలుపుతో
సంభందం లేకుండా ,డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ,అప్పటికే సిద్ధంగా ఉన్న ఇడ్లీ పెట్టించుకుని తిన్నాడు. యధావిధిగా మరోమారు దినపత్రిక తిరగేయడం మొదలుపెట్టాడు. మధ్యమధ్యలో
తలా పైకి ఎత్తి గోడగడియారం వంక చూస్తున్నాడు. తన పక్కనే వున్న మొబైల్ లో కూడా
టైం చూసుకునే అవకాశం వుంది,అయినా రాఘవయ్య ,తన చిన్నప్పటి నుంచి క్రమం
తప్పకుండా తిరుగుతున్న,ఆ .. గోడ గడియారాన్నే నమ్ముతాడు రాఘవయ్య.
=====================
సమయం ఉదయం పదకొండు గంటలు అయింది. పేపరు చదవడం ముగించి పక్కన పెట్టాడు
రాఘవయ్య. అప్పటినుండీ ఒక క్షణం గోడగడియారం వంక ,మరోక్షణం తన మొబైల్ వంకా
అదేపనిగా చూస్తున్నాడు రాఘవయ్య. అతనిలో అనవసరమైన టెన్షన్ చోటుచేసుకుంది.
కుర్చీలోంచి లేచి కాస్సేపు అటు ఇటు తిరుగుతూ,గోడగడియారాన్ని,మొబైల్ ను గమనిస్తూ,
ఎక్కువసేపు తిరగలేక మళ్ళీ కుర్చీలో కూర్చుంటున్నాడు రాఘవయ్య. ఈ లోగా తాను లంచ్
చేయవలసిన సమయం కూడా ఆసన్నమైంది. గంటకొట్టినట్టు అదే సమయంలో విశాలమ్మ
పిలుపు కూడా వినవచ్చింది. మామూలుగా అయితే మొదటి పిలుపు కె ,స్పందిస్తాడు
రాఘవయ్య. కానీ ఇప్పుడు నాలుగైదు సార్లు స్వరం పెంచి అరిచినా రాయఘవయ్య నుండి
ఎలాంటి కదలికా లేదు !
విశాలమ్మకు అనుమానం వచ్చి,డైనింగ్ టేబుల్ పైన అన్నం వడ్డించిన కంచం పై మూత పెట్టి
తడి చేతులు చీరకొంగుకు తుడుచుకుంటూ ,హడావిడిగా భర్తను సమీపించింది. రాఘవయ్య
తదేకంగా ఆలోచిస్తూ,కుర్చీలో కూర్చుని వున్నాడు. ఏదో తీవ్రమైన సమస్య అతని మెదడులో,
కదలాడుతుంటే తప్ప,రాఘవయ్య అలా ఉండ డని విశాలమ్మకు బాగా తెలుసు. ఇలాంటి
సమయాల్లో ఆమె ప్రవర్తించే తీరు గొప్పగా ఉంటుంది !
“ఏమండీ .. !ఏమిటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు ?మీ లంచ్ టైమ్ అయింది
తెలుసా ?”అంది ,మృదువుగా.
“అవును కదూ .. !”అన్నాడు,ఒకసారి మళ్ళీ గోడగడియారం వంక చూసి.
“హా .. ఆ ..గోడ గడియారాన్ని తప్ప మీరు ఎవ్వరినీ నమ్మరు కదా !డైనింగ్ టేబుల్ దగ్గర
నిలబడి,అరడజను సార్లైనా పిలిచి వుంటాను “అంది కాస్త పొడి నవ్వును ప్రదర్శిస్తూ
విశాలమ్మ.
“అయ్యో .. !వినబడలేదు విశాలా . నా టెన్షన్ లో నేనున్నాను.”అన్నాడు నీరసంగా
రాఘవయ్య.
“టెన్షనా?ఎందుకండీ మీకు టెన్షన్ !ఏమి ఉపద్రవం వచ్చి మనమీద పడింద నీ ?”అంది
కాస్త ఖంగారు పడుతూ.
“ఉపద్రవం అనుకుంటే ,ఉపద్రవమే మరి !”అన్నాడు కాస్త మెల్లగా,రాఘవయ్య.
“అబ్బా .. !!ఏమిటండీ అది. నాకు కూడా చెప్పండి. నేను కూడా మీ టెన్షన్ లో కొంత
పాలు పంచుకుంటాను కదా!”అంది మృదువుగా ,భర్త భుజం మీద చేయి వేస్తూ
విశాలమ్మ.
“నువ్వుపాలుపంచుకునేఅంశంకాదుగానీ,పద..పద..బోంచేద్దాం” అన్నాడు,రాఘవయ్య.
“అసలు మీరుఎందుకుఅలావున్నారో చెప్పండి.ఇప్పుడు మీకుకాదు,నాకులేనిపోని టెన్షన్
మొదలవుతోంది”,అందివిశాలమ్మకాస్త ఖంగారుగా.
“విశాలా...నీదగ్గర దాచిపెట్టే విషయాలు నాదగ్గరఏముంటాయిగానీ…”అంటూ,ఆగిపోయాడు
రాఘవయ్య.
“మరి...మీరు నాకుచెప్పడానికి సందేహిస్తున్న ఆ..ముఖ్యమైన అంశంఏమిటో నాకుత్వరగా
చెప్పండి”అందివిశాలమ్మ,కాస్త ఆదుర్దాగా.
“ఏమీలేడోయ్...నేను రిటైర్ అయ్యి పదిసంవత్సరాలు పైబడింది కదా!,”
“అవును....ఐయింది....ఐయితే....!!”
“ప్రతినెలా టంచనుగా,ఒకటో తారీఖున పన్నెండు గంటలలోగా,నా అకౌంట్లో పెన్షన్ జమ అయ్యేది కదా! ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు జీతమైనా ఆలస్యంగా వచ్చేదిగా నీ
నా పెన్షన్ విషయంలోఎప్పుడూ అలాజరగలేదు!”
“అవును చాలాసార్లు మీరుచెబుతుంటారు నాకు ఈవిషయం.”
“అదేమరి..!ఈ వాళ ఫస్ట్ తారీకు కదా!,ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా! పది నిముషాలు
తక్కువగా, మూడు ఐంది.” అన్నాడు,నీరసంగా రాఘవయ్య.
“ఓహో..అలాగా, రాకుండా ఎక్కడికి పోతుంది లెండి,ఏదో పొరపాటు జరిగి ఉంటుంది”అంది
నిదానంగా,విశాలమ్మ.
“నువ్వన్నట్టుగానే పొరపాటు జరిగి పెన్షన్ రావడం ఆలస్యం అయిందనుకో..ఈనెల గడవడం
యెట్లా? మన ఆర్ధిక పరిస్థితి నీకుతెలియనిదేమీ కాదు కదా ! పైగా, పండక్కి కూతురు,అల్లుడు
పిల్లలతో వస్తున్నారా, వాళ్లకి ఏదోటి చేయాలికదా!”అన్నాడు,కాస్త బరువుగా,రాఘవయ్య.
“నిజమేనండీ..! మరి ఎలా ? పోనీ...మీక్లోజ్ ఫ్రెండ్ సన్యాసిరావు గారికి ఫోన్ చేసి అడగలేక పోయారా? మీతో పాటు ఆయనకూడా పెన్షనర్ కదా!” అంది విశాలమ్మ కాస్త ఆందోళనగా.
“హా .. హా .. అదికూడా అయిపోయింది విశాలా . త ను ఏదో పని హడావిడిలో ఉన్నట్టున్నాడు ,తనకి కూడా రాలేదు అని చెప్పాడు. పైగా,’ఒక నెల పెన్షన్ కాస్త ఆలస్యం
ఐతే అంత కంగారు పడిపోవాలా?’ అని వెటకారం కూడా చేసాడు . వాళ్లకేం … చేతి నిండా
డబ్బు వుంది ,పెన్షన్ తో వాళ్లకి పని లేదు . మన విషయం కాదు కదా !” అన్నాడు ,కాస్త
నొచ్చుకుంటూ ,రాఘవయ్య .
“ ఏమండీ … !మీరు ఏమీ అనకపోతే ఒక విషయం చెబుతాను “
“ చెప్పు విశాలా ..... “
“అది కాదండీ … ఒకవేళ ఈనెల ఏ కారణం చేతనైనా పెన్షన్ మీ అకౌంట్ లో పడలేదు అను
కోండీ ,అప్పుడు ఏం చేద్దాం ? హు .. నాకు ఒక ఆలోచన తట్టిందండీ ,.... తాత్కాలికంగా, నా
మంగళ సూత్రాలు తాకట్టు పెడదాం . పెన్షన్ వచ్చాక విడిపించేసుకోవచ్చు “అంది సంతోషంగా.
“విశాలా …. ఇదా నువ్వు నాకు ఇచ్చే సలహా ?ఇంట బ్రతుకు బ్రతికి భార్య మెడలోని పుస్తెల -
తాడు తాకట్టు పెట్టాన న్న అపకీర్తి మూటకట్టుకోమంటావా ? బయటి జనం లో కూడా నా అసమర్ధత ను,ఇలా చాటుకోమంటావా ? దీని కంటే,కాస్త ఎక్కువసేపు ముక్కు మూసుకుని
ఆ .. పరమాత్ముడిని చేరుకోడం మేలు “అన్నాడు ,భార్య కళ్ళల్లోకి బాధగా చూస్తూ …
“చ .. చ .. ,అవేం మాటలండీ ,మీ బాధలో పాలుపంచుకునే అర్హత నాకు లేదా ?మీరు నూరేళ్లు హాయిగా బ్రతుకుతారు ,బ్రతకాలి కూడా !.. ముందు భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసు
కొండి,జరగవలసినదాని గురించి తర్వాత సావకాశంగా ఆలోచిద్దాం “అంది విశాలమ్మ .
ఒక సారి ,గోడ గడియారం వంక చూసి,బాధగా నిట్టూర్చి,భార్య అడుగులో అడుగు వేసుకుంటూ
డైనింగ్ రూమ్ వైపు కదిలాడు రాఘవయ్య .
******************
రాఘవయ్య ,ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు . తండ్రి తాతయ్య ,
తనకు ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించి ఇవ్వలేకపోయినా,స్వేచ్ఛగా చదువుకోనిచ్చాడు . తన
తాహతు కొద్దీ ,డిగ్రీ వరకూ చదివించి , చిన్న గుమస్తా ఉద్యోగం సంపాదించుకునే వెసులుబాటు
కల్పించాడు .
కాల చక్ర గమనం లో,అనుకూలవతి అయిన విశాలమ్మ ,తన జీవితంలో ప్రవేశించడం ,ఒక్కగా
నొక్క కూతురు ,నీలిమకు జన్మనివ్వడం ,ఆమెను వాళ్ళ స్థాయిలో అల్లారు ముద్దుగా పెంచి ,
పెద్ద చేసి,ఆమెను ఒక ఇంటి దానిని చేయడం ,రాఘవయ్య దంపతులకి అంత సులభంగా
జరిగిన పని కాదు . ఆ తర్వాత రాఘవయ్య ఆఫీసు సూపరింటెండెంట్ గా రిటైర్ అయిపోవడం
చక చక జరిగి పోయాయి .
లంచగొండి తనానికి బద్ధ శత్రువైన రాఘవయ్య ,అవకాశాలు మెండుగా వున్నా,తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి కూడా అదనంగా సంపాదించ లేదు . జనంలో
అతను మంచి మనీషి . అతని కొలీగ్స్ లో మాత్రం నూరు పైసల అసమర్ధుడుగా పేరు తెచ్చు
కున్నాడు . అందుచేత ,కేవలం ప్రభుత్వం అందించే ,ఆ .. పెన్షన్ తోనే జీవితం నడిపించుకుంటు
న్న, అతి సాధారణ కుటంబం అది !
ఉన్నట్టుండి ,”ఏమండోయ్ శ్రీవారు … “అని ,అరిచినంత పని చేసింది రాఘవయ్య భార్య
విశాలమ్మ . వాలు కుర్చీలో కూర్చున్న రాఘవయ్య ఆలోచనలకు బ్రేక్ పడి ,ఒక్కసారి ఉలిక్కి
పడినంత పని చేసి,కుర్చీలో నుంచి లేచి ,విశాలమ్మ వైపు పరుగు తీసినంత పనిచేశాడు
రాఘవయ్య .
“ఏవండీ .. ఈ రోజు ఫస్ట్ తారీకు అన్న విషయం లో ఎలాంటి సందేహమూ లేదు . కానీ,ఈ వాళ ,ఏం వారమో చూసారా ?”అంది ,కాస్త భర్తను ఆట పట్టిస్తున్న ధోరణిలో .
“అవును … విశాలా … ఈ వాళ .. ఏం వారం “అన్నాడు కంగారుగా రాఘవయ్య .
“మై డియర్ హస్బెండ్ మహాశయా .. ఈ వాళ ‘ఆదివారం ‘బాబూ . ఆఫీసులకు సెలవు,
బాంకులకు కూడా సెలవు . గుర్తు లేదా మీకు ?అవసరానికి మించిన ఆలోచనలతో ,మీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా,నన్ను కూడా బెదరగొట్టేస్తున్నారు సుమా !”
“అబ్బా … ఎంత చల్లని మాట చెప్పావోయ్ !నేను ఎంత సేపు మొదటి తారీకు గురించే ఆలో
చిస్తున్నాను తప్ప,రోజు ఏమిటన్నది ,అసలు పట్టించుకోలేదు . సరే,నేనేదో కంగారు బ్రాన్ద్ ను,
హడావిడిలో ,ఏదో అలా జరిగి పోయింది,మరి … ఆ బడుద్దాయి ,సన్యాసిరావు గాడు ,నేనింత
హైరానా పడిపోతుంటే …. చివరకు ,నువ్వుకూడా … !!”
“ఎంతైనా మీ భార్యను కదండీ … ఇన్నాళ్లు మీతో కాపురం చేసిన తర్వాత ,కొన్నైనా మీ లక్ష
ణాలు ,అబ్బకపోతే ఎలా? పైగా, మీరు చేసిన హడావిడి ,నన్ను మరో విధంగా ఆలోచనించ
నిచ్చిందా ? మీరు టెన్షన్ పడడమే కాదు,నన్ను కూడా టెన్షన్ లో పెట్టేసారు కదా !”అంది
చిరు కోపం నటిస్తూ విశాలమ్మ .
‘’అదేనోయ్ .. నీలోని గొప్ప గుణం !నేన్ను యెంత టెన్షన్ పడ్డా,ఎంత విసుక్కున్నా,నువ్వు మాత్రం చాలా నిలకడగా ,నిబ్బరంగా ఉంటావు . నిన్ను భార్యగా పొందడం ,నేను గత జన్మలో
చేసుకున్న పుణ్య ఫలం ఐయి ఉండాలి . నువ్వు గ్రేట్ విశాలా . నీ హృదయం విశాలం . ఏదీ
ఒక్క సారి ఇలా తిరుగు ,.. “అంటూ ,ఆమె పొడవాటి జడను పట్టుకుని,చిలిపిగా తనవైపు
తిప్పుకోబోయాడు ,రాఘవయ్య .
“ఆ .. ,చాలులెండి ,వయసు మళ్ళినా,చిలిపి చేష్టలకు మాత్రం కొదవ లేదు . అవన్నీ తర్వాతగానీ,ముందు రండి మీ నోరు తీపి చేస్తాను ,ఆ తర్వాత సంతోషంగా డిన్నర్ చేద్దాం .”
అంటూ ,వంట గది వైపు అడుగులు వేసింది విశాల .
“నా .. విశాలా ,వృద్దాప్యం వచ్చింది ,నా శరీరానికి గాని,నా మనసుకు కానే కాదోయ్ !నువ్వు
నాకెప్పుడూ,ఆ … విశాలవే సుమా!”
అంటూ ,సంతోషంగా భార్యను అనుసరించాడు ,రాఘవయ్య .
*సోపతి (నవతెలంగాణా )లో ప్రచురితము*
--డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ .
Comments