‘’ సుందరీ ఓసారి ఇలా వస్తావా ‘’ఎంతో ప్రేమగా ,మృదువుగా ,ఆప్యాయంగా పిలిచాడు గని రాజు. భర్త చాలా కాలం తర్వాత అంత ఆప్యాయంగా పిలవడం సుందరిని ఆశ్చర్య పరిచింది. సుందరి వంటగదిలో ఉదయ కార్యక్రమాలు మొదలెట్ట బోతున్నది. అసలే కోపిష్టి ,ఎప్పుడు కోపం ఏరూపంలో,ఎలా వస్తుందో తెలీదు . అందుకే మొదలెట్టబోతున్న పనిని ఆపి హడావిడిగా బెడ్ రూమ్ లో వున్నభర్త గనిరాజు దగ్గరకు వెళ్ళింది చేతులు చీరకొంగుకు తుడుచుకుంటూ. ఎప్పుడూ లేనిది భర్త కొద్దిగా తేడాగా కనపడ్డాడు. అటు సంతోషమూ కాదు ,ఇటు కోపము - చికాకూ కాదు ,ఎదో వింత దృశ్యం అతని ముఖంలో సుందరికి కనిపించింది. యేవో ప్రమాద ఘంటికలు ఆమె మనస్సులో కదిలాడాయి. ఎందుచేతనంటే ,సుందరిని అవమానించడానీకీ కోప్పడ్డానికి అతనికి ప్రత్యేక కారణాలు ఉండనవసరం లేదు. ఆఫీసులో చికాకు కలిగినా ,మితులతో -బంధువులతో ఘర్షణ వచ్చినా ,ఆఫీసుకు వెళ్ళేటప్పుడూ ,వచ్చేటప్పుడూ ,ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు వచ్చినా ,వాటి ప్రభావం ఏదో రూపంలో సుందరి మీద పడుతుంది. అలాంటి ఉపద్రవం ఏదో ముంచుకు వస్తున్న సూచన ఆమె మదిలో చూచాయగా మెదిలింది. కానీ తీరా వాతావరణం చూస్తుంటే అలా లేదు. మాట ,పలుకూ లేకుండా ,భర్తను సమీపించి ‘ పిలిచారా ?’అన్నట్టు అతని ముఖంలోకి చూసింది సుందరి. ‘’ అలా .. నిలబడ్డావేమి ?రా .. ఇలా రా ..’’ అని దగ్గరకు లాక్కుని వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు గని రాజు. ఈ వింత చర్యకు ,బెదిరిపోయిన లేడిలా ముఖం పెట్టి ,’ ఆ గదిలో .. అత్తయ్య వున్నారు .. ‘ అన్నట్టుగా ,మూఖాభినయం చేసింది బెదురుగా సుందరి.
ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడో .. పెళ్లయిన కొత్తలో నాలుగైదు సంవత్సరాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం లా గడిచాయి. నలుగురు కోడళ్లలో చిన్నదైన సుందరి అందం లోనే కాదు ,అన్ని రకాలుగా అందరినీ ఆకట్టుకునే మనః స్తత్వం కావడం వ ల్ల తోడికోడళ్ల కుళ్ళు ఆలోచనలకు ఆమె బలి అయిపొయింది. దాని ప్రభావం అత్తగారి ద్వారా ఆమె మీద పడింది. అప్పటినుంచి తనపట్ల భర్త తేడాలో చాలా మార్పు వచ్చేసింది . అందుకే అతని ఆప్యాతను ఎప్పుడో మరచిపోయింది ఆమె ! పగలూ రాత్రీ ఆమె యాంత్రిక జీవితానికే అలవాటు పడిపోయింది. అలాంటిది ఇప్పుడు గనిరాజు ప్రవర్తన ఆమెకు వింతగా అనిపించింది భార్య అసౌకర్యంగా ఉందని గమనినించిన రాజు ,ఆమెను పక్క కూర్చోబెట్టాడు. తల్లి అప్పుడే అక్కడికి రాదన్న భరోసా ఇచ్చాడు ఆమెకు. ‘’ సుందూ .. నిన్ను ఒక్క మాట అడగాలి. అడగమంటావా ?’’అన్నాడు ఆప్యాయంగా ఆమె భుజం మీద చెయ్యివేస్తూ …‘’ అడగండి ‘’ అన్నట్టు తలూపింది ఆమె. ‘’ నిన్ను నేను ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావిస్తున్నావా ?’’అన్నాడు మృదువుగా . ‘’ లేదు .. ‘’ అన్నట్టు ,తల అటూ ఇటూ తిప్పిందామె. ‘’ నా ప్రేమలో నీ కేమైనా తేడా కనిపిస్తుందా?’’ అన్నాడు వీపు మీద మృదువుగా రుద్దుతూ . ఆ చర్యకు ఆమె వళ్లు అదుపుతప్పినంత పని అయింది. ‘’ అదేమీ లేదు .. “అన్నట్టు సుందరి తన కనుబొమ్మలతో అభినయించి చెప్పింది. అసలు అతనికి ఈ వేళ ఏమయినట్టు ?ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు ?అని మనసులో అనుకుంది. ‘’ మరి .. నువ్వు చేస్తున్న పనులు నాకు అలా అనిపించడం లేదుకదా !’’అన్నాడు ,స్వరంలో ఎలాంటి మార్పు కనిపించకుండా. ఆ మాటతో ఆమెలో కొద్దిగా హృదయ ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఏమి జరగబోతుందో అన్న ఆందోళన సుందరిలో మొదలయింది. అతను అన్న మాటలకు అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఆమె !‘’ నువ్వు కవిత్వము కాకరకాయలూ ,రాస్తావనీ ,అది నీకు ఇష్టమైన హాబీ .. అని కూడా నాకు తెలుసు. నీ ఈ అభిరుచికి నేనెప్పుడైనా అడ్డు చెప్పానా ? పైగా మా డిపార్ట్మెంట్ మ్యాగజైన్ కు నీ చేత ఎన్నో కవితలు రాయించాను కదా! ”అన్నాడు . దానికి ఆమె ‘’అవును ‘’ అన్నట్టు మెల్లగా తల ఊపింది. ‘’ మరి .. నువ్వు చేస్తున్న పనులేమిటి ?’’ అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ .. ఆమె బెదిరిపోతున్న లేడిలా అతని వంక చూసింది .‘’ నువ్వు .. నాకు తెలీకుండా వాడుతున్న సిం -కార్డులు ఎన్ని ?’’ అన్నాడు . ‘’ మూడు ‘’ అన్నట్టు కుడిచేతి మూడు వేళ్ళు చూపించిందామె. అప్పటికే జరగ బోయేది ఏమిటో ఆమెకు అర్ధం అయిపొయింది చూచాయగా . ఎలాంటి ఘోరమైన నిర్ణయాలు జరగబోతున్నాయో నన్న భయం ఆమెలో మొదలయింది. ‘’ నువ్వు చదువుకున్నదానివి ,అందమైనదానివి ,పెళ్లీడుకొచ్చిన నలుగురు పిల్లల తల్లివి . నువ్వు మాటాడేవిధానం ,నీమర్యాద,నీసహృదయత,మన బంధు వర్గంలోనే కాదు ,నా స్నేహితుల్లో ,మా ఆఫీసులో ఎంత పేరుఉందో నీకు తెలుసు .. !’’అన్నాడు కాస్త మృదువుగా.‘’ తెలుసు ‘’ అన్నట్టు తల ఊపింది సుందరి . ఇది ఎక్కడికి ,ఎలా దారితీస్తుందో నన్నభయం కు సంభందించిన గుండె దడ వేగం ఆమెలో పెరిగింది. ‘’ ఎవరో .. సాహిత్యంలో నీకు మార్గ దర్శనం చేస్తున్న గురువులని ఇంటికి పిలిచి ముగ్గురు వయసు మళ్ళిన వాళ్ళని పరిచయం చేసావు. చాలా సంతోషించాను. వాళ్ళతో హృదయం విప్పి మాట్లాడాను. వాళ్లకు నువ్వు చేసిన సత్కారాలను నేను ,వద్ద న లేదు ,అలాగే వాళ్ళు నీకు అందించిన బహుమానాలు ,కాదనలేదు ,పైగా నేనుకూడా వాళ్ళను ఎంతగానో గౌరవించాను ,నాకు తోచిన మర్యాదలు చేసాను. కానీ … .. !!’’
‘’ ఏమిటీ ?’’అన్నట్లు ,భర్త ముఖంలోకి చూసింది సుందరి. ‘’ వాళ్ళతో ,నువ్వు -నీతో వాళ్ళూ ,చేస్తున్న చాటింగులు ,ఎవరైనా చూస్తే వాళ్ళను ,వయసుమళ్ళిన వాళ్ళు అంటారా ?నిన్ను నలుగురు పిల్లలున్న ఏభై ఏళ్ళ తల్లి అనుకుంటారా ?నన్ను .. చీము నెత్తురు వున్న,మగలక్షణాలున్న భర్త అనుకుంటారా ? వాళ్ళు నీ మీద విసిరే సెక్స్ కామెంట్లకు నువ్విస్తున్న సమాధానాలు ఎలా ఉంటున్నాయో ఒక సారైనా చెక్ చూసుకున్నావా ?వాళ్ళు నీ గురువున్నావ్ ,మరి నీ అందం ఎందుకు వాళ్లకి ?నీ అంగాంగాన్నీ వర్ణించవలసిన అవసరం ఉందా వాళ్లకి అందంతా ,నువ్విచ్చిన అలుసును బట్టే కదా !’’అన్నాడు. అతని మాటల్లో ఎక్కడా కోప -తాపాలు ,బయట పడడం లేదు. అయినా సుందరి ,బెదిరిపోయిన లేడిలా ,భయం .. భయంగా .. భర్త వంక చూస్తోంది. ‘’నీ మొబైల్ లో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ వున్నారో నీకు తెలుసునా ?ఏడువందల ఎనభై మందా ?అందులో తొంభై శాతం మగవాళ్లా ?మగవాళ్ళు స్నేహితులు కాకూడదని నేను అనడంలేదు !అయితే వాళ్లంతా ఎవరు ?’’ అన్నాడు మృదువుగా తల నిమురుతూ .సుందరి కళ్ళు కన్నీటి సముద్రాలై పొంగి పొర్లడానికి సిద్ధంగా వున్నాయి . ఎంతో జాగ్రత్తగా వున్నా భర్తకు ఇవన్నీ ఎలా తెలిసాయో ఆమెకు ఓ పట్టాన అర్ధం కావడం లేదు. ఇన్ని తెలిసినా భర్త రాజు తనను కోప్పడకుండా ఇంకా ప్రశాంతంగా మాట్లాడడం ఆమెకు వింతగానూ ,ఆశ్చర్యంగానూ అనిపించింది. ఇదే పెద్ద శిక్షలా అనిపించింది ఆమెకు.‘’ సుందూ .. మనం తీసుకున్న ఫోటోలు మనదగ్గర ,మన పిల్లల దగ్గర ఉండాలి. నువ్వు రకరకాల డ్రస్సుల్లో ,వింత .. వింత .. భంగిమల్లో ,తీసుకున్న ఫోటోలు ఇతరులకు పంపవచ్చునా ?నువ్వు చేస్తున్న పని ఏమిటీ చెప్పు ?’’ అన్నాడు. ‘’ ఎవడో .. నీకు కవిత రూపంలో ప్రేమ లేఖ రాస్తాడు ,నువ్వు అంతేవేగంగ మరో ప్రేమలేఖ జవాబు గా రాసేస్తావు. అవి ఫెస్ బుక్కు లోనూ ,పత్రికల్లోనూ ,చక్కర్లు కొడుతుంటాయి. వాటిని నేను కన్నెత్తి చూడను ,అదేగా నీ గుండె దైర్యం !నన్ను ఎంత తింగరి వాడిని చేసావు సుందరీ ?ఎంత సులభంగా బురిడీ కొట్టించావు ?అయినా ,నిన్ను నేను ఏమీ అనబోవడం లేదు. నిన్ను తిట్టి -కొట్టి సాధించేది ఏమీ లేదు . ఇప్పుడు నాలో లోపాలేమిటో ,ఎక్కడ బండి పట్టాలు తప్పుతుందో నాకు నేను విశ్లేషించుకోవాలి.’’అన్నాడు సున్నితంగా వీపు నిమురుతూ. గనిరాజు లోని ఈ సున్నితమైన ప్రవర్తన ఆమెను మరింత గుండెకోత కోయడం మొదలు పెట్టింది. నాలుగు తిట్టినా ,కొట్టినా ,ఆమెకు కొంత ఉపశమనం దొరికేది. ఆమె ఏదో చెప్పబోతుండగా ,వారించి‘’నిన్ను తిట్టి,కొట్టి లేదా అవమాన పరచి ,ఎదిగిన పిల్లల ముందు దోషిగా నిలబెట్టి పిల్లల్లో నీమీద చెడు అభిప్రాయాన్ని రుద్దను . దీనివల్ల పిల్లల్లో నామీద కూడా చెడు అభిప్రాయం కలిగే అవకాశం వుంది. రేపు నావైపు వేలెత్తి చూపే అవకాశం కూడా వుంది. అందుకే ఏమి నిర్ణయాలు తీసుకుంటావో నీ . ఇష్టం ‘’ అన్నాడు.‘’ సారీ .. అండీ .. తప్పు జరిగిపోయింది. రాజూ .. నన్ను క్షమించండి .. రాజూ .. నన్ను … !!’’రోజూ .. అయిదుగంటలకే లేచి వంటగదిలో పనులు ప్రారంభించే సుందరి ఇంకా కాఫీ అందించక పోవడం తో .. సుందరిని వెతుక్కుంటూ పడక గదికి వచ్చిన గని రాజుకి .. ఇంకా పక్కమీది నుండి లేవకుండా పదే .. పదే .. ‘సారీ రాజు .. నన్ను క్షమించండి .. ‘అంటూ కలవరిస్తున్న సుందరి ని ,అటూ - ఇటూ కదిపి‘’ సుందరీ .. ఏమిటీ ఈ కలవరింతలు ?అరెరే .. ఏ. సి వున్నా ఈ చెమటలు ఏమిటీ ?లే .. లే .. లేచి త్వరగా పనులు చేసుకో .. !’’అని చేయి పట్టుకుని మెల్లగా లేపాడు. లేచిందే కానీ ,సందరి మస్తిష్కంలో ఆ .. కల ,పదే .. పదే సుడులు తిరగ సాగింది. పని చేస్తున్నదే గానీ ,ఏమాత్రం వాటిమీద సరైన దృష్టి పెట్టలేక పోతున్నది. త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ,స్నానం చేసి భర్తకు అత్తకు కాఫీ కలిపి ఇచ్చింది.బ్రేక్ఫస్ట్ పని పూర్తి అయ్యాక గబ గబా వంటపని పూర్తి చేసి ,ఆఫీసుకెల్లే సమయానికి భర్తకు కేరెజి సిద్ధం చేసింది. అత్తకు స్నానానికి సిద్దం చేసింది. భర్త చేతిలో లంచ్ కేరెజి పెట్టి ,గేటు వరకూ సాగనంపింది. వెళ్తూ .. వెళ్తూ గని రాజు'' సుందరీ .. నీకు కలత నిద్రలో ఇబ్బంది అయి భయపడి నట్లున్నావు. త్వరగా లంచ్ పూర్తి చేసుకుని ,అమ్మకు టి . వి లో తనకు ఇష్టమైన పాత సినిమా పెట్టి కాస్సేపు ప్రశాంతంగా నిద్రపో !'' అని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. కలత నిద్రలో తన కళ్ళముందు ప్రత్యక్ష మైన సన్ని వేషం గుర్తుకు వచ్చి
నిలువెల్లా కంపించి పోయింది. అది కనక నిజమైతే .. !తన పరిస్తితి యెమయ్యేట్టు ?ఒక్కసారి తన కళ్ళముందు చీకటి ఆవరించినంత పని అయింది. ఈ విషయాలు నిజంగా విదేశాల్లో వున్న పిల్లలకు తేలేస్తే ..'అమ్మో .. ' అనుకుంది మనస్సులో. తక్షణం ఒక నిర్ణయానికి వచ్చింది సుందరి. నిజ జీవితంలో తనకు పెద్ద విలువ ఇవ్వకున్నా ,కావలసిన అవసరాలకు తనకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదుభర్త . పరిస్తితి విషమించక ముందే ,జాగ్రత్తపడాలి అనుకుని తీరిగ్గా మంచం మీద కూర్చుని మొబైల్ లోని అనవసర ఖాతాలను డిలీట్ చేయడం మొదలు పెట్టింది. గ్రూపులన్నింటికీ సలాము కొట్టే దిశలో సుందరి సున్నితమైన వే ళ్ళు మొబైల్ మీద కదులు తున్నాయి.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
హనంకొండ
Kommentare