top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

తొందర ....!! (హాస్య కథ )

Updated: May 1, 2021




ఆ .. రోజు రానేవచ్చింది. 

ఆ ఇల్లు పెళ్లి కళతో నిండి,అందరిలోనూ హడావిడి చోటు చేసుకుని వుంది. 

బంధువులతో పాటు వచ్చిన పిల్లల ఆట-పాటలు, కన్నె పిల్లల తళ తళలు 

మిలమిలలు,చాలా కాలం తర్వాత కలుసుకున్న దగ్గర -దూరపు బంధువుల ,స్నేహితుల,కుశల ప్రశ్నలు ,తరిగిపోని ముచ్చట్లతో,అక్కడ 

ఇంచుమించు ఒక ఆత్మీయ సమ్మేళన వాతావరణం నెలకొని వుంది. 

ఒక పక్క కబుర్లు చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటుంటే ,కొందరు ఆత్మీయంగా ,తమకు అప్పగించిన పనిని,సరదాగా,ఆనందంగా,హాయిగా 

చేసుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడు,వయసు మీరిన పెద్దవాళ్ళు 

తమ అనుభవాల మూటను విప్పి,సాధ్యాసాధ్యాలు   ఏమాత్రం ఆలోచించకుండా,తోచిన సలహాలు ఇచ్చి పోతున్నారు. ఇలా రకరకాల 

సన్నివేశాలతో,ఆ .. పెళ్లి ఇంటి వాతావరణం సందడి .. సందడిగా వుంది. 


మరో వైపు,... అప్పుడే పెళ్లింటికి వచ్చిన బంధువులు తమకు కేటాయించిన వసతి వెతుక్కుంటూ ,కూడా తెచ్చుకున్న  చిరు సామానుతో ఇంటి లోపల  అటు -ఇటు తిరుగుతున్నారు,అదనపు సదు-

పాయాల కోసం,ఎంక్వయిరీ చేస్తున్నారు. ముఖం కడుక్కోవాలనుకునే-

వాళ్ళు ,స్నానాల కోసం,వాష్ రూమ్ వెతుక్కునే వాళ్ళు,చిన్న పిల్లల్లా -

రెండు వేళ్ళు చూపిస్తూ హడావిడిగా అటు ,ఇటు ,పరిగెత్తేవాళ్లు ,ఇంటి పెద్ద కోసం హైరానా పడేవాళ్ళతో,సన్నివేశం పెళ్లి సందడిని హై లైట్ చేస్తోంది !


అప్పుడే ఇంటి యజమాని,పెళ్లికూతురు తండ్రి శివరావు గారు,బయట 

వరండాలో వున్న,సింక్ దగ్గర గడ్డం చేసుకుని,తొందర .. తొందరగా ,వాష్-

రూమ్ కి వెళ్లి తలుపేసు కున్నారు. ఆయన స్నానం చేస్తేనే కానీ ,కొన్ని 

పనులు తెమలవు. 

రెండు ----


ఆయన అటు వెళ్ళాడో లేదో,... క్యూలో వున్న ఇంటి పెద్దల్లుడు ,చంద్ర -

కుమార్,బ్రష్ పట్టుకుని పేస్ట్ కోసం తిరుగుతూ,వరండాలో సింక్ దగ్గరికి 

చేరుకున్నాడు. 

కుమార్ గా పిలవబడే ,చంద్రకుమార్ ,ఇంటి యజమాని శివరావు గారికి,

పెద్దల్లుడు. తొందరపాటు మనిషి ,అలగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య !సాధారణంగా అత్తారింట్లో జరిగే ఎలాంటి ఫంక్షన్ కి ఆయన రాడు ,

సాధారణంగా భార్యా -పిల్లలినే పంపుతుంటాడు. ఆయన వ్యవహార శైలిని 

బట్టి ,చాలా మంది ‘ఆయన రాకుంటేనే బాగుణ్ణు ‘అనుకుంటారు. కానీ,ఇం

ట్లో ,ఆఖరి పెళ్ళికావడం,పైగా అది తనకిష్టమైన ఆఖరి మరదలి పెళ్లి కావ-

డం తో,వీలు కల్పించుకుని,మంచి మనస్సుతో,మామ గారి మాటను 

కాదనలేక సతీ సమేతంగా విచ్చేసారు కుమార్. 

కుమార్ ఆ .. ఇంటి పెద్దల్లుడు అయినప్పటికీ ,చాలామంది బంధుగణం,

స్నేహితులు,హితులు,కూడా శుభకార్యాల్లో కుమార్ కనిపించకపోతేనే,

బావుంటుంద నే ,అభిప్రాయం తో ఏకీభవిస్తారు. అలా ఎందుకు అనుకుం-

టారో చెప్పకపోతే,అనవసరంగా కుమార్ గారిని పదిమందిలోనూ,బా హా -

టంగా ,అవమానించినట్టు అయిపోతుంది. ఆ .. పాపం నేను మూట గట్టుకోలేను కదా !

కుమార్ ,ఎప్పుడైనా మనసుపడి బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళి 

తే,కార్యక్రమాలు అయ్యేవరకూ చూచే వాళ్లకు ,ఆయనంత సహృదయ వ్యక్తి మరొకరు వుండరు,ప్రేమకు -పలకరింపుకు,ఆయనకు ఆయనే సాటి!

ఇక తిరుగు ప్రయాణానికి సన్నద్ధమయ్యే సమయానికి,కథ కొసమెరుపు 

మారిపోతుంది !ఎదో అర్ధం పర్ధం లేని చిన్ని విషయానికి గిల్లి-కజ్జం పెట్టు -

కుని,దీనంతటికీ తన భార్య కమల కారణం అని,ఆమెను తిట్టినా తిట్టు ,

తిట్టకుండా,ఆ కాస్త సంతోషాన్నీ మురికి గుంటలో కలిపేస్తాడు. 

మూడు ------


ఇలాంటి నేపధ్యం లో కుమార్,పెళ్లింట్లో రాత్రి పడుకునే ముందు దంత ధా-

వనం కోసం అని ,పేస్ట్ వెతుక్కుంటూ ,వరండాలో వున్న సింక్ దగ్గరికి 

చేరుకున్నాడు. అనుకున్నట్టుగానే అతనికి ఒక ట్యూబ్ కనిపించింది. హడా విడిగా కాస్త క్రీమ్ బ్రష్ మీద పెట్టుకుని,,కాసిన్ని నీళ్లు దానిమీద చల్లి,గబ గబా .. బ్రష్ చేసుకోవడం మొదలు  పెట్టాడు. తాను అంత త్వర-

పడడానికి కారణం ఏమిటంటే,వాళ్లకి కేటాయించిన పడక గదిని,మరెవరైన

ఆక్రమిస్తారని. అదీ అసలు ఆయన భయం !

బ్రష్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత,మామూలుకు భిన్నంగా,

కుమార్ నోటి నిండా నురుగు రావడం మొదలుపెట్టి,ముఖం మీదికి 

మేఘాలుగా వ్యాపించడం మొదలు పెట్టింది. తన జీవిత కాలంలో,కుమార్

ఎన్నో రకాల పేస్టులు వాడాడు గానీ,ఇంత నురుగు వచ్చే పేస్ట్ ఎప్పుడూ 

వాడలేదు !ఈ వింతను ,ఆయనకంటే ఆ చుట్టుపట్ల అటు ,ఇటు ,ఎదో పనిమీద తిరుగుతున్నవాళ్ళు,బాగా ఎంజాయ్ చేయడం మొదలు 

పెట్టారు. 

అంతమాత్రమే కాదు,అటు -ఇటు ,తిరుగుతున్నఆడపిల్లలు ఆయన ముఖ సౌందర్యాన్ని చూసి,తమలో తాము పక .. పక ,నవ్వుకోవడం 

మొదలు పెట్టారు. పైగా .. దీనికి తోడు,ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళని సైతం 

అక్కడికి తీసుకు వచ్చి ,ఆ .. సన్నివేశాన్ని మనసారా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. 

అప్పుడే అక్కడికి ఎదో పనిమీద వచ్చిన,పెళ్లికూతురైన మరదలు పిల్ల 

పెద్ద బావగారి ముఖం చూసి,

‘’అయ్యో బావా .. !!’’అంటూ ,గుక్కపట్టి నవ్వడం మొదలు పెటింది. 

‘’ఏంటి మరదలు పిల్లా .. ఎందుకు అలా నవ్వుతున్నావ్ ?’’అన్నాడు,

నోట్లోనునించి జారిపోతున్న నురుగును ఓ పక్కకి తోసేస్తూ. 

నాలుగు ----


‘’ఏంలేదు బావా .. వూరికే నవ్వు వచ్చింది అంతే ..!!’’అని,ఇంకా పక .. 

పక .. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. 

ఇలాగే ,కొందరు అబ్బాయిలు కూడా తనను చూచి నవ్వుకుంటూ వెళ్లిపోవడం ,కుమార్ గమనించక పోలేదు!

‘’రాత్రి పూట బ్రష్ చేసుకోవడం వీళ్ళందరికీ నవ్వులాటలా వుంది ‘’అను-

కున్నాడు ,మనస్సులో కుమార్. 

ఈలోగా స్నానానికి వెళ్లిన మామగారు బయటికి వచ్చి,అల్లుడి ముఖం 

చూసి,ఆయన కూడా నవ్వడం మొదలు పెట్టె సరికి ,కుమార్ కి చిర్రెత్తు -

కొచ్చింది . 

అతని మూడ్ మారబోతుందన్న విషయం గ్రహించి ---

‘’అల్లుడు గారూ .. మీరు వాడుతున్న పేస్ట్ ఎక్కడ కొన్నారు ?’’అన్నాడు. 

‘’నేను పేస్ట్ కొనడం ఏమిటి మామగారు !మీ అమ్మాయిని దీనికోసం ఇబ్బంది పెట్టడం ఎందుకని,... ఇక్కడ మీరు వాడిన పేస్ట్ వాడాను !’’

అన్నాడు కుమార్ ,సీరియస్ గా. 

‘’భలే వారే మీరు … అది టూత్ పేస్ట్ కాదండీబాబూ … షేవింగ్ క్రీమ్ !!

దానిని అక్కడ వదిలి,నేనే పొరపాటు పని చేసాను సుమండీ !’’అన్నాడు 

ఆయన ,నవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతూ …. 

‘’ఆ .. !!అవునా ,గుర్తించలేకపోయాను సుమండీ !అందుకే ఇంత నురుగు 

సుమా !’’అన్నాడు. 

ఇప్పుడు నవ్వడం కుమార్ వంతు అయింది. అతగాడిని చూసి,అక్కడ 

వున్నా వాళ్ళందరూ ,పొట్ట చెక్కలయ్యేట్టుగా నవ్వడం మొదలు పెట్టారు. 

కుమార్ … హడావిడిగా అక్కడ ఒక్క క్షణం ఆగకుండా తన గదికి 

పారిపోయినంత పని చేసాడు. 

                       *              *               **



   

డా.కె.ఎల్.వి.ప్రసాద్

హనంకొండ.






27 views0 comments

Recent Posts

See All

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ... చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన విలువైన సంతా నం ,శేఖర్ బాబు .తల్లిదండ్రులకు గారాల బిడ్డ .ఇంట్లోఅందరికీ అతడొక జీవమున్న ఆటవస్తువు అయిపోయా

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజ

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నా

Post: Blog2 Post
bottom of page