top of page

చిన్టూ గాడి చమక్కు (గల్పిక)

  • Writer: కె.ఎల్.వి.
    కె.ఎల్.వి.
  • Dec 10, 2021
  • 2 min read

జోగం జీవితం అంటే ఏమిటో చిన్నతనం లోనే చవిచూచాడు. అనుకోకుండా అతనికి ఆ అవకాశం ఎదురొచ్చినట్లైంది . నిజానికి జోగం అసలు పేరు అదికా దు . చిన్నప్పుడే మేనమామ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జోగం . మేనమామ పిల్లలతో చదువుకోవడానికి కూర్చుని ,నిద్రను ఆపుకోలేక జోగి పోయేవాడట !అందుకే ,అందరూ సరదాగా అతనికి ‘ జోగం ‘ అని పేరు పెట్టేసి సరదాగా ఆడిస్తూండేవారట . అలా .. ‘ జోగం ‘ అనేది చంద్రశేఖర్ రావుకి నిక్ - నేమ్ గా స్థిరపడిపోవడమే కాదు ,అసలు పేరు వదిలేసి అందరూ జోగం .. అనే పిలుస్తుంటారు అతగాడిని. ఎదుగుతున్న వయసులో జోగం మేనమామ ఇంటికి చదువుకోవడానికి హైదరాబాద్ రావడం తో ,అక్కడ మేనమామ ఆర్ధికంగా పడుతున్న బాధలు వ్యధలు ప్రత్యక్షంగా చూడడం తో ,మేనమామలా భవిష్యత్తులో బాధపడకూడ దనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు . సంపాదించిన దానిలో ఎంతో కొంత పొదుపు చేసి వెనకేసుకోకపోతే మేనమామ సూర్యం లా తానుకూడాఎప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు పడవలసి వస్తుందని అప్పుడే గ్రహించాడు . విద్యా శాఖలో చిన్న ఉద్యోగం చేసే సూర్యం ప్రతినెలా ఐదో తారీకుకే జీతం ఖర్చుపెట్టేసి అప్పులు చేయడం ససేమిరా జోగంకి నచ్చలేదు . మేనమామ సూర్యం అలా ఆర్ధికంగా బాధపడుతున్నా మేనత్త కళ -అనబడే కళావతి ,అదేమీ పట్టించుకోకుండా చీరలుకొనమనీ ,షికార్లకు తీసుకెళ్లమని భర్తను వత్తిడి చేయడం జోగం కు అసలు నచ్చలేదు . తాను ఉద్యోగస్తుడై పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులకు దారి తీయకుండా తన సంసారాన్ని తీర్చి దిద్దుకోవాలని కలలు కన్నాడు జోగం. పొదుపు గురించి బాగా ఆలోచించి ప్రతి విషయంలోనూ పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసాడు . మేనమామకు తనవల్ల మరింత భారం కాకూడదనే ముందు చూపుతో ఒక ప్రభుత్వ వసతి గృహం చూసుకుని మేనమామ అనుమతితో అక్కడ చేరిపోయాడు . అప్పటినుండి జోగం జీవనశైలి పూర్తిగా మారిపోయింది . జోగం డిగ్రీ పూర్తిచేయడం ,పోటీపరీక్షలకు రాయడం ,విద్యాశాఖలో ఉద్యోగం రావడం చక చకా జరిగిపోయాయి . ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి ,తనకు అనుకూలవతి అయిన ఉద్యోగిని సుజాతతో పెళ్లి అయింది . అతనికి తగ్గట్టుగా నే సుజాత కూడా తన జీవనశైలిని మార్చుకుని అతనికి సహకరించడం మొదలు పెట్టింది . ఆ విధంగా వాళ్ళ సంసారం సంతృప్తిగా సాగిపోవడమే కాదు ,పెళ్లయిన సంవత్సరానికి మెరికలాంటి పిల్లాడు పుట్టాడు . తండ్రిని మించిన తనయుడిగా ఎదగసాగాడు . చదువులో తనతోటి వారికంటే ఎంతో చురుకుగా ఉంటూ చక్కని ప్రతిభ చూపిస్తున్నాడు . జీవితం గురించి ,జీవితం లో అవసరమైన పొదుపు ప్రాధాన్యత గురించి తండ్రి ఎప్పటికప్పుడు చెప్పే విషయాలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు . విశాల్ గా పేరుపెట్టి ముద్దుగా చింటూ అని పిలవబడే జోగం పుత్ర రత్నం ఒకరోజు స్నానం కోసం వాష్ రూమ్ లో బకెట్ లోనికి నీళ్లు వదిలి టేప్ కట్టేయడం మర్చిపోవడం తో నీళ్ళన్నీ వృధా అయిపోవడం చూసి లబో దిబో మని మొత్తుకున్నాడు జోగం . చింటూకు సీరియస్ గా క్లాసు పీకాడు జోగం . నీళ్లు వృధాకాకూడదన్నాడు . ఇప్పుడు మనం నీటిని వృధాచేస్తే భావితరాలకు నీరు దొరక్క మనల్ని తిట్టుకుంటారు అన్నాడు . తండ్రి మాటలు జాగ్రత్తగానే విన్నాడు పదేళ్ల చింటూ . మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు . కొన్నిరోజుల తర్వాత భార్యాభర్తలు జోగం ,సుజాత లు ,షాపింగ్ కు వెళ్ళవలసి వచ్చింది . చింటూకి పరీక్షలు ఉండడంతో అతడిని చదువుకోవడానికి వీలుగా ఇంట్లోనే వదిలి వెళ్లారు . షాపింగ్ పూర్తి చేసుకుని వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి ,చింటూ ఒక్కడూ చీకట్లో కూర్చుని మౌనంగా వున్నాడు . తండ్రీ ఇది గమనించి --- ‘’ చింటూ అదెంటినాన్నా చదవకుండా అలా చీకట్లో కూర్చున్నావేమిటి ?’’ అన్నాడు తండ్రి జోగం . దానికి చింటూ చాలా సీరియ్ స్ గా ముఖం పెట్టి ‘’ మీరేకదా నాన్న గారు ఎప్పుడూ చెబుతుంటారు ,ఏదీ వృధా చేయకూడదు అని , అందుకే ముందుతరాల కోసం కరెంట్ ఆదా చేద్దామని అలా చేసాను ‘’ అన్నాడు తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ . ఆ వాతావరణం నుండి తేరుకోవడానికి తండ్రికి చాలా సమయం పట్టింది . ఉబికి .. ఉబికి వస్తున్న నవ్వును అదిమి పట్టుకుని ,మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయింది సుజాత .


---- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

Recent Posts

See All
అవ్వ మనసు (గల్పిక)

రామకృష్ణాకాలనీ హన్మకొండ.* వర్షాకాలమే ,అయినా వర్షాలు లేవు . మేఘము -మెరుపులు జతకట్టి ఉరుముల చప్పుడుకి ,వర్షించడం మాని ,ఆకాశంలో తేలిపోయాయి...

 
 
 
అద్దం చెప్పని అందం ..!!   (గల్పిక )

రాధా కృష్ణ ఆలోచనలో పడ్డాడు . ఎన్ని రోజులనుంచో మెదడును తొలిచేస్తున్న విషయం . ఎంత వద్దనుకున్నా ,అతడి మనసు అదేవిషయాన్ని పదేపదే...

 
 
 

コメント


Post: Blog2 Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook

*గమనిక* 
ఈ..సాహిత్య సంపద నా స్వంతం. ఇతరులు ఎవరూ, ఏ అంశాన్ని నా అనుమతి లేకుండా  ఏ విధంగా ను ఉపయోగించ రాదు.అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 -----డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్. రచయిత.

Copyright ©2021 klvsahityam by KLV Prasad. All rights reserved

bottom of page